మెదక్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి 'మీ కోసం నేనున్నానంటూ' అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి నెల రెండో తేదీ, 16వ తేదీన.. రెండు రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో సాయిరాంతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
వినతులు భారీగా...
అన్ని రకాల సమస్యల తక్షణ పరిష్కారమే 'మీ కోసం' కార్యక్రమం లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ఎక్కువగా భూ సమస్యలు, పింఛన్, ఇళ్లు, సీసీ రోడ్ల కోసం వస్తున్నారని తెలిపారు. హవేలి ఘనపూర్, పాపన్నపేట, మెదక్, రామయంపేట, నిజాంపేట ప్రజల నుంచి వినతులు భారీగా వచ్చాయని.. అక్కడే ఉన్న అధికారులతో అప్పటికప్పుడే సమస్యలు తీర్చామని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 36 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.17 లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, నాయకులు లింగారెడ్డి, అశోక్, కౌన్సిలర్ కిశోర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సాగర్ ప్రచారంలో ఏడ్చిన భాజపా అభ్యర్థి