నిజాం కాలంలో సుభాగా ఉన్న మెదక్ పట్టణానికి రైల్వేలైన్ ఏర్పాటు ఇక్కడి ప్రజల దశాబ్దాల కల. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సమయం నుంచి ప్రజాప్రతినిధులు రైల్వేలైన్ ఏర్పాటుపై హామీలిస్తూ వచ్చారు. 2012-13 రైల్వేబడ్జెట్‌లో కాస్ట్ షేరింగ్ విధానంలో అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ మంజూరైంది. రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ పట్టణం వరకు 17.2 కి.మీల మేర రైల్వేలైన్ నిర్మాణానికి దశలవారీగా రూ.200 కోట్లు కేటాయించారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి భూమి సేకరించి రైల్వేశాఖకు అప్పగించగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడంతో పనులు చేపట్టారు.
పనులు తుదిదశకు చేరుకున్నా...
అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం రూ.200 కోట్ల వరకు వ్యయం చేస్తోంది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.114 కోట్లు వెచ్చించింది. రైల్వేలైన్ నిర్మాణానికి అయ్యే వ్యయంలో 50 శాతం వాటా భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో హామీ ఇవ్వడంతో కేంద్రం ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. ప్రాజెక్టు పూర్తి కావడానికి అయ్యే వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ రైల్వేలైన్ నిర్మాణానికి కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఇవ్వగా ఇంకా రూ.80 కోట్లు రైల్వేశాఖకు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు ఇవ్వక పోవడంతో రైల్వే అధికారులు గతేడాది నవంబర్‌లో పనులు నిలిపివేశారు.
నిధులు అందక
మొత్తం 17.2 కి.మీల లైన్‌కు ఇప్పటి వరకు 15 కి.మీల మేర పట్టాలు బిగించారు. చిన్న, పెద్ద వంతెనలు కలిపి మొత్తం 44కు 42 పూర్తయ్యాయి. ఇంకా రెండు మిగిలి ఉన్నాయి. రామాయంపేట మండలం లక్ష్మాపూర్, హవేలి ఘనపూర్ మండలం శమ్నాపూర్, జిల్లా కేంద్రం మెదక్‌లో రైల్వేస్టేషన్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. మెదక్‌లోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి స్టేషన్ వరకు అప్రోచ్ రోడ్డును నిర్మించనున్నారు. పనులు తుదిదశకు చేరుకున్న తరుణంలో నిధులు అందక... మరో వైపు పనులు కొనసాగక పోవడంతో రైల్వే ప్రయాణానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
బడ్జెట్‌లో ప్రవేశపెట్టినా అందని నిధులు..
రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా నిధులను కేటాయించింది. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్‌కు రూ.80 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.50 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రైల్వేశాఖకు అందలేదు. ప్రారంభం నుంచి నిధుల మంజూరులో ఆలస్యంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతానికి రామాయంపేట మండలం లక్ష్మాపూర్, హవేలి ఘనపూర్ మండలం శమ్నాపూర్ వద్ద రైల్వేస్టేషన్ల నిర్మాణం, 2.2 కి.మీల ట్రాక్ పనులు, రెండు వంతెనల నిర్మాణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నిధులు వస్తే పనులు కొనసాగే అవకాశం ఉంది.
నిధులు రావాల్సి ఉంది..
అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.20 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు అందలేదు. కోవిడ్-19 కారణంగా ఆలస్యమవుతోంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తాం.
- సుబ్రహ్మణ్యం, రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజినీర్
ఇదీ చదవండి: మేకలు, గొర్రెలు పెంపకానికై... యూట్యూబ్ ఛానల్