సెలవుల కారణంగా పట్టణాలు, గ్రామాల్లో విద్యార్థులు, యువకులు బావులు, చెరువుల్లో ఈతకు వెళ్లి... ప్రమాదవశాత్తు మునిగి కుటుంబానికి తీరని శోకం మిగులుస్తున్నారని మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈత నేర్చుకోవాలని చాలా మంది పిల్లలు ఉత్సాహం చూపుతుంటారని.... చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల విలువైన ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారన్నారు. ఇలాంటి విషాద ఘటనలు తలెత్తకుండా ఉండాలంటే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడంమంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈతకు వెళ్లే చిన్నారులపైన తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నిపుణుల పర్యవేక్షణలోనే ఈత నేర్చుకోవాలని తెలిపారు. శిక్షకులు లేకుండా... కొత్తవారు ఈతకు వెళ్లవద్దన్నారు. పిల్లల మీద తల్లిదండ్రుల పర్యవేక్షణ అనేది వారి బాధ్యత అని ఎస్పీ తెలిపారు.