మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో జిల్లా విద్యాధికారి పర్యటించారు. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నర్సాపూర్ పట్టణంలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావాలని ఆదేశించారు. తరచూ పాఠశాలలను తనిఖీ చేయాలని మండల విద్యాధికారులను ఆదేశించారు.
మహ్మదాబాద్ గ్రామ సమీపంలోని కస్తూరిబా విద్యాలయాన్ని తనిఖీ చేశారు. పాఠశాలలో పలు రికార్డులను తనిఖీ చేశారు. పలు గ్రామాలు, గిరిజన తండాలకు వెళ్లి విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వింటున్నారా అని తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే.. సెల్ఫోన్లో క్లాసులు వినాలని సూచించారు. పిల్లలు ఆన్లైన్లో పాఠాలు వినేందుకు వారికి కేటాయించిన సమయంలో ఫోన్ అందుబాటులో ఉంచాలని తల్లిదండ్రులను కోరారు. విద్యార్ధులు ఇంటి వద్దే ఉంటూ.. ఆన్లైన్ పాఠాలు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. కౌడిపల్లి మండలంలోని పలు పాఠశాలలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి సుభాష్, ప్రిన్సిపల్ శ్వేత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్ సహా ఇద్దరు మృతి