ధరణి పోర్టల్లోని వివిధ క్యాటగిరిల్లో పెండింగ్లో ఉన్న భూ సంబంధిత దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ రెవిన్యూ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో భూ సంబంధిత ఫిర్యాదులు, 22-ఏలో పేర్కొన్న నిషేధిత భూములు, వారసత్వ పట్టా మార్పు(పౌతి )తదితర అంశాలపై అన్ని మండలాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఈ నెల 15 నుంచి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో వేయనున్నందున… అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లాలో భూ సంబంధిత సమస్యలు, 22-ఏ, పౌతికి సంబంధించి సుమారు 100 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని.. వాటిని చెక్ లిస్టు ప్రకారం అన్ని దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. పెండింగ్ మ్యుటేషన్లో తొందరపడి కొన్ని తప్పులు చేస్తున్నారని జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు. కుటుంబ సభ్యుల వివరాలు సక్రమంగా ఉంటేనే ఆమోదించాలని, ఇనాం భూముల వివరాలను పరిశీలించాలని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.రమేశ్, ఆర్.డి.ఓ.లు సాయిరాం, శ్యాం ప్రకాశ్, వివిధ మండలాల ఉప తహసీల్దార్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ముందు గ్యాస్ వాడండి.. తరువాతే బిల్లు చెల్లించండి