లారీలు, హమాలీల కొరతపై ఎప్పటికప్పుడు అధికారులకు తగు సూచనలిస్తూ.. అప్రమత్తం చేయడంతో పాటు మిల్లులను సందర్శించామని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. యజమానులతో సంప్రదింపులు జరపడం ద్వారా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయని తెలిపారు.
ఇప్పటి వరకు 284 కోట్ల రూపాయల విలువ గల లక్ష 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 16,230 మంది రైతుల ఖాతాల్లో 158 కోట్ల రూపాయల డబ్బులు చెల్లించామని అన్నారు. ఇంకా రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం ఈ మూడు వారాల్లో కేంద్రాలకు వచ్చే అవకాశముందని చెప్పారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ధాన్యం రాశులు కేంద్రాలకు విరివిగా వస్తున్నందున వేయి క్వింటాళ్ల లోపు ధాన్యం కొనుగోలు చేయవలసిన చిన్న చిన్న కేంద్రాల్లో వెంటనే కొనుగోళ్లను పూర్తి చేసి... గోనె సంచుల్లో నింపి.. ఆ కేంద్రాలను మూసివేస్తూ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ను, హమాలీలను పెద్ద కేంద్రాలకు తరలించవల్సిందిగా కలెక్టర్ అధికారులకు సూచించారు. తద్వారా జిల్లా యంత్రాంగం పెద్ద కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి కొనుగోళ్లను మానిటరింగ్ చేస్తూ మరింత వేగవంతం చేయవచ్చని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు కేంద్రాలు నిర్వహిస్తామన్నారు. రైతులు కాస్త ఓపిక పట్టాలని కలెక్టర్ కోరారు. ఈ లాక్డౌన్ సమయంలో వ్యవసాయ అత్యవసర సేవల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలింపుకై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు 24 గంటలు పనిచేస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆదర్శ పలెల్లు: కట్టుబాట్లు, జాగ్రత్తలతో సత్ఫలితాలు