రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాజపాదే హవా అని ఆ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. కమలం పార్టీయే అత్యధిక సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు.
జిల్లా కేంద్రం మెదక్ సాయి బాలాజీ గార్డెన్ లో మంగళవారం జరిగిన బిజెపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన తెలిపారు.
గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ గెలవమోనని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. డబ్బు,మద్యం విచ్చలవిడిగా పంచి మళ్ళీ అధికారంలోకి వచ్చేవారని భాజపా నేతలు ఆరోపించారు. తెరాస ప్రభుత్వం నీళ్ళు, నిధులు,నియామకాలు అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ఊసే పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలైనా ఏ ఒక్క నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లోలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు..ప్రతీ ఇంటికి తీసుకుని వెళ్లి చెప్పి.. ప్రజలను చైతన్యం పరచి గ్రేటర్ లో కూడా విజయం సాధించి భాజపా మేయర్ పదవి చేపడుతుందన్నారు. దుబ్బాకలో బిజేపీ విజయం తెరాసకు ఒక చెంప పెట్టని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ఆందోళన