ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని అందరి సహకారంతో విజయవంతం చేసి మెదక్ జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లాలోని గ్రామాలు, తండాలు, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రోడ్లకు ఇరువైపులా కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని ఆకాంక్షించారు. ఈనెల 25 నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. హరితహారంలో రాష్ట్రంలోనే మెదక్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న సమయంలో మొక్కలు నాటితే అన్నింటినీ రక్షించుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనికి గాను మొక్కలకు ఇనుప ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని వాటిని సంరక్షించుకోవాలన్నారు. జిల్లాలో అవకాశం ఉన్న ప్రతి చోట రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. ఈసారి నాటే మొక్కల్లో వందకు వంద శాతం మొక్కలు బతికేలా ప్రణాళికలు రూపొందించుకోవడంతో పాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో హనోక్, జిల్లా మైనింగ్ శాఖ అధికారి జయరాజ్, ల్యాండ్ అండ్ సర్వే జిల్లా ఏడీ గంగయ్య, డీడబ్ల్యూవో షేక్ రసూల్బీ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్.. కర్నల్ కుటుంబానికి పరామర్శ