మెదక్ పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల తీరుపై కలెక్టర్ నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఈనెల 15లోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ఆర్ అండ్ బీ అతిథిగృహం వద్ద పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. స్థానిక జంబికుంటలో చెత్తసేకరణ తీరును పరిశీలించారు. మురుగు కాలువల్లో చెత్తను పారబోయడం, రహదారిపైనే చెత్త ఉండడంతో సిబ్బందిపై మండిపడ్డారు. రోడ్డుపై చెత్తను వేసిన వారికి పది వేల రూపాయల జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిని ఆదేశించారు. చెత్తను పారబోసే వారి ఫోటోలు తీయాలని స్థానికంగా నివాసం ఉంటున్న నీటిపారుదలశాఖ ఏఈ శ్రీహరికి సూచించారు. ప్రస్తుత సీజన్‌లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. అంతకుముందు ఔరంగబాద్ శివారులో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఇప్పటికే పనులు ఆలస్యమయ్యాయని, వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని గుత్తేదారుకు సూచించారు. అదనపు పాలనాధికారి వెంట మున్సిపల్ డీఈఈ మహేశ్, ఏఈ సాయాగౌడ్ తదితరులు ఉన్నారు.
ప్రజలకు అనుగుణంగా పార్కులు
రామాయంపేట: ప్రజలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు పార్కులు ఏర్పాటు చేయిస్తున్నామని అదనపు పాలనాధికారి నగేష్ అన్నారు. శుక్రవారం ఆయన రామాయంపేటలో పర్యటించారు. నూతనంగా నిర్మించిన శౌచాలయాన్ని పరిశీలించారు. అనంతరం యాదాద్రి పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించి నాలుగు ఎకరాల్లో త్వరగా మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వెయ్యి మందికో శౌచాలయం నిర్మిస్తామన్నారు. యాదాద్రి తరహాలో పార్కు ఏర్పాటుచేసి ఔషధ మొక్కలు నాటుతామని చెప్పారు. కమిషనర్ శేఖర్‌రెడ్డి, సిబ్బంది ప్రసాద్ తదితరులు ఉన్నారు.
తూప్రాన్: జిల్లాలోని పురపాలికల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అదనపు పాలనాధికారి నగేష్ తెలిపారు. శుక్రవారం తూప్రాన్ పురపాలిక కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట పురపాలికల్లో నర్సరీలు, పార్కుల ఏర్పాటు, సామాజిక శౌచాలయాల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్థలాల ఎంపిక పూర్తయిన చోట నిర్మాణాలు ప్రారంభించామన్నారు. తూప్రాన్‌లో నాలుగు చోట్ల సామాజిక శౌచాలయాల నిర్మిస్తున్నట్లు చెప్పారు. బాలుర పాఠశాలలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తుల స్వీకరణ పక్రియను పరిశీలించారు. ఆర్డీవో శ్యామ్‌ప్రకాశ్, పుర అధ్యక్షుడు బొంది రవీందర్‌గౌడ్, తహసీల్దార్ శ్రీదేవి, కమిషనర్ ఖాజామోయినొద్దీన్ ఉన్నారు.