మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట, నార్సింగి మండలాల్లో నవంబర్ 3న ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన చర్యలపై కలెక్టర్ ఎం.హనుమంతరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పోలింగ్ సమయంలో సిబ్బంది కొరత ఉండకుండా చూడాలని సంబంధిత నోడల్ అధికారికి తెలిపారు.

పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహిస్తామని.. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ను ప్రారంభిస్తామని కలెక్టర్ చెప్పారు. ఓటర్లు కరోనా నిబంధనలను పాటిస్తూనే పోలింగ్‌లో పాల్గొనాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్తు సరఫరా, సెంటర్ల ముందు టెంట్లు, తాగునీటి వసతితో పాటు వీల్ఛైర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని హనుమంతరావు వివరించారు.
ఎన్నిక జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శనివారం నుంచి నవంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని హనుమంతరావు పేర్కొన్నారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగుంపులుగా తిరిగితే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రచార సమయం ముగుస్తుందని.. ఆ తర్వాత ఎక్కడా మైకులు, లౌడ్ స్పీకర్లు వాడటం, పాటలు పాడటం, ఉపన్యాసాలు ఇవ్వడం వంటివి చేయకూడదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండిః 'దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి'