జిల్లాను పచ్చగా, పరిశుబ్రంగా ఉంచేలా అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ విజ్ఞప్తి చేశారు. కలుషిత వాతావరణం నుంచి మానవ జాతిని కాపాడేందుకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్ పచ్చదనానికి ఎంతో ప్రాముఖ్యత నిచ్చి తెలంగాణాకు హరితహారం కార్యక్రమం చేపట్టారని అన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని వెంకట్రావు నగర్, హౌసింగ్ బోర్డు కాలనీల్లోని పట్టణ ప్రకృతి వనం, నర్సరీలను మున్సిపల్ కమీషనర్ శ్రీహరితో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
జిల్లా ప్రధాన రహదారుల వెంట మెక్కలు నాటబోతున్నట్లు కలెక్టర్ హరీష్ తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల ప్రాంగణాలలో, ఇతర ఖాళీ ప్రదేశాలలో కూడా మొక్కలు నాటేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు కూడా తమ ఇంటి ఆవరణలో పండ్లు, పూలు, ఔషద మొక్కలు నాటాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలో మురికి కుంటలను గుర్తించి కాలువలు నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న కట్టడాలను తొలగించాలని మున్సిపల్ కమీషనర్‌కు సూచించారు. త్వరలో చేపట్టబోయే ఏడో విడత హరితహారంలో పట్టణాలు పరిశుభ్రంగా మారాలని, పచ్చదనం వెల్లివిరియాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?