ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ కేథడ్రాల్ చర్చ్ క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. చర్చ ముందు భారీ శాంతా క్లాజ్‌ను ఏర్పాటు చేశారు. రేపు జరగనున్న వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక పాస్టర్ నెట్ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
క్రిస్మస్ వేడుకల్లో భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రెస్ బీటర్ ఇంఛార్జ్ ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ తెలిపారు. మాస్కు ధరించిన భక్తులను థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే... మహా దేవాలయంలోకి పంపిస్తారని పేర్కొన్నారు.
క్రిస్మస్ పర్వదినాన మొదటి ఆరాధన ఉదయం 4:30 గంటల నుంచి 2:00 గంటల వరకు రెండు ఆరాధనలు ఉంటాయని తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా 24 మండలాలకు అధ్యక్షుడిగా ఉన్న జాఫ్నా బిషప్ రైట్ రెవరెండ్ మోడరేటర్ ధర్మరాజు రసలం భక్తులకు దైవ సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు.
క్రిస్మస్ వేడుకలకు వేలాది మంది తరలి రానున్న దృష్ట్యా... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో 600 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు.
ఇదీ చూడండి: క్రైస్తవులకు గవర్నర్, సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు