కొవిడ్ నిబంధనల మధ్య గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నామని మెదక్ అడిషనల్ కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఆర్డీఓ సాయిరామ్, డీఎస్పీ కృష్ణమూర్తి, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రసంగం..
జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ఉదయం 8 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయాలని చెప్పారు. కలెక్టరేట్లో తొమ్మిదింటికి జెండా ఆవిష్కరణ, పోలీసుల గౌరవ వందనం ఉంటుందని తెలిపారు. ప్రజలను ఉద్దేశించి పాలనాధికారి ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
కలెక్టరేట్‌కు వచ్చిపోయే దారులను చదును చేయాలని.. ఆర్అండ్బీ ఈఈకి సూచించారు. మైదానంలో దుమ్ము లేవకుండా నీళ్ళు చల్లడం, తాగునీరు సమకూర్చడం, మార్క్ ప్రకారం సున్నం వేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిని ఆదేశించారు.
భద్రతా చర్యలు..
స్వాతంత్ర సమరయోదులకు ఆహ్వానాలు పంపాలని, రిఫ్రెష్మెంట్ ఏర్పాటు చేయాలని రెవిన్యూ శాఖకు సూచించారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాల్సిందిగా ట్రాన్స్‌కో అధికారులకు తెలిపారు. అగ్ని ప్రమాద భద్రతా చర్యలు తీసుకోవాలని ఫైర్ సిబ్బందిని ఆదేశించారు.
కరోనా కారణంగా ఈసారీ ఎగ్జిబిషన్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అవార్డుల పంపిణీ లేదని పేర్కొన్నారు. సమావేశంలో తూప్రాన్ ఆర్డీఓ శ్యాంప్రకాశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మధ్యలో ఆపేస్తే కోర్సు మొత్తం ఫీజు కట్టాలా..?