ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెంపు, మాతా, శిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. మూడేళ్ల క్రితం పథకం అమల్లోకి రావడంతో సర్కారు ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య రెట్టింపు అయింది. కిట్‌తో పాటు ప్రోత్సాహక మొత్తం ఇస్తుండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన గర్భిణులు దవాఖానాల బాట పట్టారు.
మెదక్ జిల్లాలో ఏటా సగటున 12,000 మంది గర్భిణులుగా నమోదవుతున్నారు. వారిలో 9000 మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవిస్తున్నారు. వారందరికీ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందుతోంది. మరింత బలవర్ధక ఆహారం తీసుకోవడం, ఔషధాల కొనుగోలు, ఇతర అవసరాలకు కేసీఆర్ కిట్ ప్రోత్సాహకం ఎంతో ఉపయోగపడుతోంది.
4వేల మందికి పైగా...
ఇప్పటివరకు జిల్లాలో వేలాది మందికి పగా గర్భిణులు, బాలింతలకు రూ.1.25 కోట్ల మేర ప్రోత్సాహకం అందాల్సి ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 5,646 మంది గర్భిణులు పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో ఐదు నెలలు పూర్తయిన 883 మందికి, బాలింతల్లో 936 మందికి, మొదటి ఇమ్యునైజేషన్ పూర్తయిన వారిలో 1,256, రెండో ఇమ్యునైజేషన్ పూర్తయిన వారిలో 1,161 మందికి ప్రోత్సాహకం అందలేదు. దవాఖానాల్లో ప్రసవాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా... సకాలంలో గర్భిణులు, బాలింతలకు ప్రోత్సాహక మొత్తం అందకపోవడంతో వారంతా ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం..
ప్రోత్సాహకం అందించాల్సిన వారి వివరాలను ప్రభుత్వానికి పంపాం. నిధులు ఉన్న మేరకు గర్భిణులు, బాలింతల ఖాతాల్లో నగదు జమ అవుతోంది.
- వెంకటేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి