Farmers Protest: మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతిధర్మారం విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతులు రాస్తారోకో నిర్వహించారు. గత రెండు రోజులుగా విద్యుత్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఇస్తున్నారని.. అలా కాకుండా 24 గంటల విద్యుత్ ఇవ్వాలని రైతులు ఆందోళన చేశారు. వేసవిలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని గతంలో సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని ఇప్పుడు కేవలం 10 గంటల ఇవ్వడం ఎంతవరకు న్యాయమని అన్నదాతలు ప్రశ్నించారు.
అసలే వేసవి కాలం.. మధ్యాహ్నం పూట కరెంటు ఇవ్వడం వల్ల బోరు మోటార్లలో నీరు రావడం లేదని.. దీనివల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రజాప్రతినిధులు విద్యుత్ అధికారులు చర్యలు తీసుకొని 24 గంటల కరెంటు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. రామాయంపేట ఎస్సై రాజేష్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులను శాంతింపజేసి నిరసనను విరమింప చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కంటే ముందు 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఇప్పుడేమో 9గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారు. దీనివల్ల కొందరి బోర్లు పోస్తున్నయి.. మరికొందరి బోర్లేమో పోస్తలేవు. రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. పంటలు ఎండిపోతుండగా రైతులు ఉరిపెట్టుకునే పరిస్థితులు వస్తున్నయి. బంగారు తెలంగాణ తెచ్చింది రైతులు ఉరి పోసుకునేందుకేనా?. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. -రైతు
24 గంటల కరెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలు కోతకొచ్చే దశలో ఉండగా.. కరెంట్ 10 గంటలకు తగ్గిస్తే పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ తీసుకొచ్చి ఏం సాధించినట్లు. రైతులకు ఇస్తామన్న 24 గంటల కరెంట్ ఎటుపోయింది?. -రైతు
ఇదీ చదవండి: