ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట ఎండిపోతుందని చెరువులో ఉన్న నీళ్లను వదలాలని అడిగిన రైతులను గ్రామపంచాయతీలో నిర్బంధించిన ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శలిపేటలో చోటు చేసుకుంది. వేసవి సమీపించడంతో భూగర్భజలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. ఈ క్రమంలో నల్లచెరువు నుంచి నీటిని విడుదల చేయాలని రైతులు కోరగా... తహసీల్దార్ స్పందించారని వెల్లడించారు.
గ్రామ వీఆర్వోని పంపించారని... కానీ సర్పంచ్ పోచయ్య కలగజేసుకుని గ్రామసభ పెట్టుకున్న తర్వాత నీరు వదులుతామన్నారని తెలిపారు. ఇప్పటికీ సభ పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. పంటలు ఎండిపోతుండడంతో నీరు వదిలేందుకు కట్టకు వెళ్లగా... సర్పంచ్, అతని కుమారులు అసభ్యంగా మాట్లాడి నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సైకి సమాచారం అందించామని... పోలీసులు వచ్చి విడిపించారని తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఉపాధి కూలీల వినియోగానికి ఆ శాఖల విముఖత