పొత్తంశెట్టిపల్లి- ఏడుపాయల రహదారిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 31 కోట్ల 31 లక్షల 50వేల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు రోడ్డు నిర్మాణానికి గతంలో 19 కోట్ల రూపాయలు మంజూరు కాగా వాటితో వంతెనలు నిర్మించారని చెప్పారు.
నిధులు సరిపోక రోడ్డు అసంపూర్తిగా ఉండటం వల్ల ఏడుపాయలకు వచ్చే భక్తులకు ఇబ్బందిగా ఉండేదని... ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా గతంలో మంజూరు చేసిన నిధులకు అదనంగా 12కోట్ల 31లక్షల 50 వేల రూపాయల మంజూరు చేశారని పేర్కొన్నారు.
దీనితో అసంపూర్తిగా ఉన్న వంతెనల నిర్మాణం పూర్తై రోడ్డు సంపూర్ణంగా వినియోగంలోకి వస్తుందని స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న మహాశివరాత్రి పర్వదినం వరకు పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మంజూరైన నిధుల ద్వారా సీసీ రోడ్లు, వంతెన పనులు, వంతెనపైన ఫూట్ పాత్ తదితర పనులు చేపడతారని తెలిపారు. నిత్యం వేల సంఖ్యలో ఏడుపాయలకు వచ్చే భక్తులకు వంతెన నిర్మాణం సంపూర్ణం అవడం వల్ల ఇక్కట్లు తొలిగిపోతాయని అన్నారు.