కరోనా మహమ్మారి గొలుసు తెంచే ఉద్దేశంతో విధించిన లాక్‌డౌన్‌తో కొందరు అభాగ్యుల బతుకులు ఆగమవుతున్నాయి. ఏ దిక్కూ లేనివారు రోడ్డున పడుతున్నారు. దాతలు ఇచ్చే ఆహారంతోనే కడుపు నింపుకోవాల్సిన దైన్యం నెలకొంది. మెదక్ జిల్లా మాచవరం గ్రామానికి చెందిన పద్మకు ముగ్గురు పిల్లలు. ఈమె సంగారెడ్డిలో బస్టాండ్లను శుభ్రం చేస్తూ ఉపాధి పొందేవారు. లాక్‌డౌన్ కారణంగా ఆ పని లేకుండాపోయింది. ప్రస్తుతం బస్టాండ్ పరిసరాల్లోనే పిల్లలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఒక్క పొట్లం మాత్రమే దొరకడంతో ఆ తల్లి మొదట తన పిల్లలకే తినిపించారు.
పెద్దశంకరంపేటకు చెందిన లక్ష్మి తన ఇద్దరు చిన్నారులతో నాలుగు రోజులుగా బస్టాండ్ ఆవరణలోనే ఉంటున్నారు. భర్త మృతి చెందాడు. కూలి పనులు చేసుకుని బతికేవారు. లాక్‌డౌన్‌లో పనులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: 'గర్భిణీలకు కరోనా సోకినా.. లోపల ఉన్న బిడ్డకు రాదు'