రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి.. పుష్కలంగా నీరు అందిస్తూ.. ఇప్పుడు వరి సాగు చేయవద్దని చెప్పడం విడ్డూరంగా ఉందని బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర కో ఆర్టినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. రైతులను వరిసాగుచేయద్దంటే ఇప్పుడు వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు (RS Praveen Kumar comments on the sale of grain seeds). వరి విత్తనాలు అమ్మే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామనడం దారుణమన్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి... కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టులు నిర్మించి... ఇప్పుడు వరి సాగుచేయొద్దంటే రైతుల నోట్లో మట్టి కొట్టినట్టవుతుందని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ప్రవీణ్‌కుమార్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధరలు చూపించకుండా... వరి వేయకూడదనే ఆలోచనను ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు చెరకు మిల్లులు లేవని... మక్కల పరిస్థితి దారుణంగా ఉందని.. పత్తికి అధిక డిమాండ్ ఉన్నప్పటికీ జిన్నింగ్ మిల్లులు లేవని.. రాష్ట్రంలో ఫుడ్ పరిశ్రమలు లేవని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో ఏడాది పొడవునా... నీళ్లు ఉండేలా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును కట్టించుకున్నారని ఆరోపించారు. కరీంనగర్ ముంపు గ్రామాల్లో వందలాది ఎకరాలు నీట మునిగిపోయాయని ఇప్పటివరకు నష్టపరిహారం విడుదల చేయలేదన్నారు. మీడియా సమావేశం అనంతరం మెదక్ పట్టణంలో బహుజన సమాజ్ వాది పార్టీ కార్యకర్తలు ఐబీ నుంచి బాలాజీ గార్డెన్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు (bsp bike rally in medak).
వరి విత్తనాలు విక్రయించే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిగారు అన్నట్టు తెలిసింది. దీనిని బట్టి ఆయన తన పరిధికి మించి మాట్లాడినట్టు అనిపిస్తోంది. ప్రత్యామ్నాయ పంటలు చూపించకుండా.. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఏటా కోట్లల్లో విద్యుత్ బిల్లులు చెల్లిస్తూ.. ఇప్పుడు వరి సాగు చేయొద్దంటే రైతులు ఏమి చేయాలి.. ఉరి పెట్టుకోవాలా..? ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. ఈ విషయం ముందు నుంచే ఎందుకు చెప్పలేదు. ఇది అనాలోచితమైన చర్య. రైతుల నోట్లో మట్టికొట్టే చర్య. ఈ హెచ్చరికలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ముంపు గ్రామాల్లో ఇంకా పరిహారాలు చెల్లించలేదు.. అక్కడ సాగు భూములను లాక్కున్నారు.. ఇక్కడ సాగు చేసుకుందామంటే వద్దంటున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
-ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్
ఇదీ చూడండి: Harish rao campaign: 'ప్రజలను మోసం చేసే భాజపాకు ఎందుకు ఓటెయ్యాలి?'