మోడీ ప్రవేశ పెట్టిన ప్రజా ప్రయోజక పథకాలను, మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రచారం చేస్తామన్నారు. బీజేపీ నేత పేరాల శేఖర్ రావు. ఈ మేరకు ఆయన మెదక్ పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్లో సమావేశం ఏర్పాటు చేశారు. మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు.
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడిందన్నారు. భారతదేశం అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధి చెందడానికి నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. త్వరలో ఆరున్నర లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నామన్నారు. 2022 లోపు సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే విధంగా హౌస్ ఫర్ ఆల్ పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్ల నిర్మాణానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర పథకాన్ని అన్ని సామాజిక వర్గాల ప్రజలు, చిన్న వ్యాపారులు ఉపయోగించాలని, ఈ పథకం కోసం ఒక ఐఏఎస్ అధికారిని, ఒక మంత్రిని కేటాయించారని ఆయన అన్నారు.
ఉత్తర ప్రదేశ్ మాదిరిగా తెలంగాణలో కూడా వలస కార్మికుల కమిషన్ ఏర్పాటు చేయాలని.. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సహకరించాలని డిమాండ్ చేశారు. 14 లక్షల కోట్ల నుండి 33 లక్షల కోట్లకు దేశ బడ్జెట్ ను పెంచిన ఘనత మోడీ ప్రభుత్వానిది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి గోపి , మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?