మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య దంపతులు రేకుల ఇంట్లో నివాసం ఉండేవారు. 40 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రేకుల ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులయ్యారు. కాగా కరోనా కాలం నేపథ్యంలో ఎవరూ ఇళ్లల్లోకి రానీయక పోవడం వల్ల చెట్టు కింద నివాసం ఉన్నారు. విషయం తెలుసుకున్న కొందరు వ్యక్తులు హైదరాబాద్ బీడీఎల్ విన్నర్స్ ఫౌండేషన్ అధినేత అరికెపూడి రఘుకి సమాచారం అందించి చేయూతను ఇవ్వాల్సిందిగా వేడుకున్నారు.
40 రోజుల్లో ఇల్లు నిర్మించి...
తక్షణమే స్పందించి ఆయన ఆ నిరుపేద వృద్ధ దంపతులకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు, వంట సామగ్రి, దుస్తులు అందించారు. యుద్ధప్రాతిపదికన 40 రోజుల కాలంలోనే దాతల సహకారంతో శాశ్వత ఇల్లు నిర్మించి ఇచ్చారు. నిరాశ్రయులై చెట్టు కింద ఉన్న వారిని ఓఇంటి వారిని చేసిన బీడీఎల్ విన్నర్స్ ఫౌండేషన్ వారిని పలువురు ప్రశంసిస్తున్నారు. బీడీఎల్ సంస్థ పుణ్యమాని తాము ఓ ఇంటి వారమయ్యామని చంద్రయ్య దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చూడండి: కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్