Couple Died in Accident : కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా దేవుని దర్శనం చేసుకున్నారు. అంతా బాగా జరిగిందనుకొని తిరిగి ఇంటికి వస్తుండగా.. అనుకోని ఆపద ఎదురైంది. క్షణాల్లో వారి సంతోషం కాస్తా.. విషాదంగా మారిపోయింది. ముందు వెళ్తున్న వావానాన్ని ఓవర్టేక్ చేయబోయి.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో దంపతులు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..: హైదరాబాద్ శివారు ప్రాంతమైన జీడిమెట్ల సాయిబాబా నగర్ కాలనీకి చెందిన నాగలింగరాజు(46), అతని భార్య రమ (38) వారి పిల్లలు, బంధువులతో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలకు వెళ్లారు. దైవ దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో.. మెదక్ జిల్లాలోని మమ్మద్ నగర్ స్టేజీ వద్ద లారీని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. దీంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద తీవ్రతకు నాగలింగరాజు మృతదేహం సీటులో ఇరుక్కుపోగా.. జేసీబీ సాయంతో బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను, క్షతగాత్రులను నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, నర్సాపూర్ సీఐ షేక్‌లాల్, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..: ఇదిలా ఉండగా.. మరో ప్రమాదంలో పెళ్లి కావాల్సిన యువకుడు దుర్మరణం చెందాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరిపేట వద్ద గురువారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ నెల 12న లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెం గ్రామానికి చెందిన సాయికుమార్ వివాహం నిశ్చయం కాగా.. బంధువులకు, మిత్రులకు పెళ్లి పత్రికలు పంపిణీ చేసి వస్తుండగా.. మార్గమధ్యలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మిత్రుడు మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి: