మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం కొంతాన్ పల్లికి చెందిన ప్రశాంత్, గుండ్లపల్లికి చెందిన పావని దసరా సెలవులకు అమ్మమ్మ ఊరైన ఘనపూర్‌కు వచ్చారు. ప్రశాంత్, పావని వరుసకు అన్నాచెల్లెల్లు. వీరిద్దరూ ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో స్నేహితులతో కలిసి గ్రామ శివారులో గల నరసింహ స్వామి గుట్ట వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. పిల్లలందరూ జారుడు బండపై ఆడుకుంటుండగా... ప్రమాదవశాత్తు ప్రశాంత్ పక్కనే ఉన్న కుంటలో పడిపోయాడు. వెంటనే పావని అన్నని రక్షించేందుకు కుంటలోకి దూకింది. ఇద్దరూ మునిగిపోవడం గమనించిన పిల్లలు అరవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ప్రశాంత్ అప్పటికే చనిపోగా... పావని చికిత్స పొందతూ తూప్రాన్ ప్రభుత్వాసుపత్రిలో మరణించింది.
ఇవీ చూడండి: వరదలకు ఉత్తర భారతం విలవిల- 137మంది మృతి