Polluted Godavari River: గోదావరి నదీ పరీవాహక ప్రాంతం కాలుష్యానికి అడ్డగా మారుతోంది. పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న మంచిర్యాల మున్సిపాలిటీలోని... పరిశ్రమలు, ఇళ్ల నుంచి వస్తున్న వ్యర్ధాలన్ని నేరుగా గోదావరిలో కలిసిపోతున్నాయి. తద్వారా నీటిలో కరిగి ఉండే... ఆక్సిజన్ పరిమాణం క్రమంగా తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. నీటి పరిమాణంలో ఉండాల్సిన పీహెచ్ కంటే ఎక్కువ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల నురగలు కనిపిస్తుడటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల క్రితం నుంచి నిర్మించిన మురుగునీరు శుద్ధికేంద్రాలు సరిగా పనిచేయకపోవడంతో కొత్త సమస్యలొస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తీరప్రాంతాల్లోని పట్టణాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించి... గోదావరిలో కాలుష్య పదార్ధాలు చేరకుండా చూడాలని కోరుతున్నారు.
మంచిర్యాలలో గతంలో నిర్మించిన మురుగునీటి శుద్ధికేంద్రం నిరుపయోగంగా ఉంది. నస్పూరు, చెన్నూరు కొత్త పురపాలక సంఘాల్లో శుద్ధి కేంద్రాలే నిర్మించలేదు. ఇక్కడ జనాభా లెక్కల ప్రకారం 1.10 లక్షల మంది ఉన్నారు. వీరు కాలకృత్యాలు, ఇంటి అవసరాలకు ఉపయోగించిన వృథానీరులో రోజుకు దాదాపు 11 ఎంఎల్డీ మురుగు వెలువడుతోంది. ఇందులో సగం భూమిలో ఇంకిపోయినా, మిగితాది గోదావరిలో కలుస్తోంది. మిగతా పురపాలక సంఘాల్లో సైతం ఇదే పరిస్థితి. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నదీతీరప్రాంతాల్లోని పట్టణాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించి శుద్ధి చేసిన నీరు బయటకువదలాలని ప్రజలు కోరుతున్నారు.
'కేంద్ర కాలుష్య నియంత్రణమండలినివేదిక ప్రకారం గోదావరి పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉందని అర్థమవుతుంది. మురుగునీరు గోదావరిలోకి చేరి నదీజలాలు కలుషితం అవుతున్నాయి. అదే నీరు తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పురపాలికల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించడంలో ఇక్కడి పాలకులు, అధికారులు నిర్లక్ష్యం చేస్తు న్నారు. జిల్లాలో ఏడు పురపాలక సంఘాలు ఉండగా... అందులో నాలుగు పట్టణాలు నదీతీరంలోనే ఉన్నాయి. చెరువు నీరు పంట పొలాలకు పోయినప్పుడు... అందులో రైతులు అధిక దిగుబడి కోసం వాడే విషపూరిత మైన రసాయనాలు కూడా నదిలో కలుస్తోంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కోరుతున్నా.'- నరేశ్, మంచిర్యాల వాసి
ఇదీ చదవండి: Minister Harish on Omicron : 'పండుగలొస్తున్నయ్.. జర భద్రంగా ఉండండి'