తెలంగాణ ఉద్యమకారుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తెరాసతో తెగదెంపులకు సిద్ధమయ్యారు. గురువారం సాయంత్రం ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తన సతీమణి, మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్ భాగ్యలక్ష్మితో కలిసి ఓదెలు దిల్లీ బయల్దేరి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఓదెలు పార్టీ కండువా కప్పుకోనున్నారు. 2009, 2014 ఎన్నికల్లో తెరాస తరఫున ఆయన విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఆయన గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్ విప్‌గానూ ఓదెలు పనిచేశారు.
అందుకే తెరాసను వీడుతున్నారా?: చెన్నూరు నియోజకవర్గ తెరాసలోని విభేదాలే ఓదెలు పార్టీ వీడాలనే నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో అగాధం పెరగడం.. అతడితో విభేదాల కారణంగానే ఓదెలు పార్టీని వీడుతున్నట్లు సమాచారం. గత కొన్నిరోజులుగా సన్నిహితులు, అభిమానులు, కుటుంబసభ్యులతో ఓదెలు విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలోనే అందరి అభిప్రాయాలు తీసుకుని తెరాసను వీడి కాంగ్రెస్‌లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఓదెలు తెరాసను వీడుతున్న విషయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.