బయటికెళ్లి కావల్సిందేదైనా తెచ్చుకునే ఓపిక లేదా? పోనీ బండిలో పెట్రోల్ లేదా..? బస్సులో వెళ్లి వచ్చే సమయం లేదా? అయితే మీలాంటివారికోసమే మేమున్నాం అంటున్నారు మంచిర్యాలలోని బెల్లంపల్లికి చెందిన ఓ యువబృందం. ఈ బృందాన్ని ఏకంచేసి, ఓ యాప్ కేంద్రంగా నడిపిస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు. గ్రామీణ దుకాణాలు, వినియోగదారులకు మధ్య వారధిలా పనిచేస్తోందీ లోకల్ ఆన్‌లైన్ యాప్.
లోకల్ ఆన్‌లైన్ యాప్
సాల్మన్ జోన్స్, డానియల్ కమలాకర్ అన్నదమ్ములు. ఇద్దరూ ఎంటెక్ పట్టభద్రులే. బాల్యం నుంచే కంప్యూటర్ వాడకంపై అవగహన కలిగిన ఈ ఇద్దరూ.. ఆన్‌లైన్ ట్రెండ్‌కు తగ్గట్లుగా యువతకు స్వయం ఉపాధి చూపించాలని భావించారు. బెల్లంపల్లిలో ఏడాది క్రితం అయిదుగురు సభ్యులతో లోకల్ ఆన్‌లైన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మంచిర్యాల, గోదావరిఖని, గట్కేసర్, దేవరకొండలాంటి ప్రాంతాలకు సేవలను విస్తరించారు. 30 మందికి ఉపాధి కల్పించారు.
ఒక్క ఫోన్ చేస్తే చాలు
5 కిలోమీటర్ల పరిధిలో... లోకల్ ఆన్‌లైన్ సేవలు అందిస్తున్నామని లోకల్ ఆన్‌లైన్ వ్యవస్థాపకుడు సాల్మన్ జోన్స్ తెలిపారు. కిరాణా సామగ్రి, భోజనం సహా... అన్ని రకాల వస్తువులను డోర్ డెలివరీ చేస్తామని వెల్లడించారు. అన్ని వ్యాపార, వాణిజ్య దుకాణాలకు సంబంధించిన వివరాలను యాప్‌లో పొందుపరిచామని.. ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలనుకుంటే యాప్‌లో కనిపించే నంబర్కు ఒక్క ఫోన్ చేస్తే చాలని తెలిపారు. అరగంట వ్యవధిలో పార్సిల్ ఇంటికి చేరుతుందని వెల్లడించారు. ఇందుకోసం 30 రూపాయల నామమాత్రపు రుసుమును వసూలు చేస్తున్నామన్నారు.
విద్యుత్ బైక్‌లు వాడి
సాల్మన్, డానియల్ సైతం డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తారని వినియోగదారులు తెలిపారు. డెలివరీ కోసం విద్యుత్ బైక్‌లనే వినియోగిస్తూ... పర్యావరణహితంగానూ పనిచేస్తున్నామని చాటుతున్నారు. అదనంగా పెట్రోల్, డీజిల్‌కయ్యే ఖర్చును తగ్గిస్తూ... ఆ భారం వినియోగదారులపై పడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇంట్లోంచి బయటికి వెళ్లే అవసరం లేకుండానే సరకులు ఇంటికి చేరుతుండడంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
30 మందికి ఉపాధి
అసలే కరోనా కష్టకాలం. ఉపాధి లేక మహామహులే ఖాళీగా గూటికి చేరిన పరిస్థితులు. ఈ నేపథ్యంలో 30 మందికి ఉపాధి కల్పిస్తూ... వారికి అండగా నిలుస్తున్నారు సాల్మన్ సోదరద్వయం. తమకూ ఉపాధి కలగడం పట్ల యువతీయువకులు సంతోషంగా ఉన్నారు.
డోర్ డెలివరీ చేయాల్సిన సరకులు ఎక్కువ మోతాదులో ఉంటే... 30 రూపాయలు కూడా తీసుకోరు. ఆయా దుకాణదారులు ఎమ్మార్పీ ధరలకు సరకులు ఇవ్వడంతో పాటు... కొంత ప్రోత్సాహకం ఇస్తుండడం యాప్ నిర్వాహకులకు కలిసివస్తోంది. యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత బెల్లంపల్లిలోని తమకు గిరాకీ పెరిగిందని దుకాణదారులు చెప్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా బాధితులా.. ఆదుకొనే ఆసుపత్రులివే!