Harish Rao Speech at Mancherial Public Meeting : గత కొన్ని రోజులుగా జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న మంత్రి హరీశ్‌రావు.. తాజాగా నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. రూ.80 కోట్ల 50 లక్షల వ్యయంతో హాజీపూర్‌లో చేపట్టనున్న పడ్తాన్‌పల్లి ఎత్తిపోతల పథకం, దొనబండలో విద్యుత్ ఉప కేంద్రం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన ప్రగతి నివేదన సభలో పాల్గొన్న హరీశ్... బీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధిని వివరిస్తూనే కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ మాయమాటలు చెబుతోందని... ఆ పార్టీకి కనీసం అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందని విమర్శించారు.
Harish Rao Fires on JP Nadda : బీజేపీ నేతలు జేపీ నడ్డా, బీఎల్ సంతోశ్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నడ్డా.. తెలంగాణ కేసీఆర్ అడ్డా అంటూ హరీశ్‌రావు పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో బీజేపీని గెలిపించుకోలేని నడ్డా.. తెలంగాణలో గెలిపిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకుంటే.. కనీసం మీ పార్టీ పరువైనా దక్కుతుందని హితవు పలికారు. మరోవైపు.. బీఎల్ సంతోశ్ కర్ణాటకలో బీజేపీని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఆయన అంటున్నట్లు తెలంగాణలో హంగ్ రాదని.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఎల్ సంతోశ్ వల్ల కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ ఆ పార్టీ పతనం ఖాయమని స్పష్టం చేశారు.
నడ్డా.. తెలంగాణ కేసీఆర్ అడ్డా. సొంత రాష్ట్రంలో బీజేపీని గెలిపించుకోలేని నడ్డా.. తెలంగాణలో గెలిపిస్తారా? డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకుంటే మీ పార్టీ పరువైనా దక్కుతుంది. బీఎల్ సంతోశ్.. తెలంగాణలో హంగ్ రాదు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది. కర్ణాటకలో బీజేపీని భ్రష్టు పట్టించారు. తెలంగాణలోనూ బీఎల్ సంతోశ్ వల్ల ఆ పార్టీ పతనం ఖాయం. - మంత్రి హరీశ్‌రావు
ప్రపంచంలో ఎక్కడా లేని కమిటీలు వేస్తున్నారు.. : అనంతరం చెన్నూరులో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన.. బీజేపీ 14 కమిటీలపై స్పందించారు. బీజేపీ నేతలు ప్రపంచంలో ఎక్కడా లేని కమిటీలు వేస్తున్నారని.. డిపాజిట్ల కమిటీ వేసుకుంటే.. కనీసం ఆ పార్టీ పరువైనా దక్కుతుందని హితవు పలికారు. ఈ క్రమంలోనే 100 సీట్లతో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ.. కనీసం ప్రతిపక్ష హోదాను దక్కించుకోవాలని సూచించారు.
Harish Rao on BJP and Congress : 'బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రానికి శాపంగా మారాయి'
రేపో మాపో శుభవార్త..: చెన్నూరు అభివృద్ధి కోసం పని చేసే బాల్క సుమన్‌ను మరోసారి గెలుపించుకోవాలని హరీశ్‌రావు సూచించారు. కాంగ్రెస్ అంటే ముఠాలు, మంటలు, కుర్చీల కోసం కొట్లాటలని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు సృష్టిస్తారని ఆరోపించారు. ఈ క్రమంలోనే పింఛన్, రైతుబంధు ఎంత పెంచాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారన్న మంత్రి.. రేపో మాపో శుభవార్త వింటారని స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఏం ఇవ్వాలో అని కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు.