ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఇద్దరు యువకులను అక్కడి పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన లచ్చన్న, రాజు గత మూడేళ్ల కిందట ఉపాధి కోసం ఇరాక్‌లోని ఎబ్రిల్ ప్రాంతానికి వెళ్లారు.
నాన్న కోసం మనమే వెళ్దాం అమ్మా!
అక్కడ ఓ పాఠశాలలో పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితం అక్కడి పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ తండ్రి ఎప్పుడు వస్తారని అడిగిన పిల్లలకు ఆ తల్లి సమాధానం ఇవ్వలేక బావురుమంటోంది. నాన్న రాకపోతే మనమే వెళ్దామన్న ఆ చిన్నారుల మాటలతో చూసినవారంతా కన్నీరుమున్నీరవుతున్నారు.
తిరిగొచ్చేలా చూస్తాం
బాధిత కుటుంబాలు గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘాన్ని ఆశ్రయించారు. వారిని తిరిగి స్వదేశానికి రప్పించాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆ యువకులు త్వరగా స్వదేశానికి వచ్చేలా చూస్తామని సంఘం ప్రతినిధులు భరోసా కల్పించారు.
నిబంధనలు కఠినతరం చేయండి
కొంతమంది ఏజెంట్ల మాయలో పడి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు అక్కడే చిక్కుకుంటున్నారని విమానాశ్రయాల్లో ఇమిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని సంఘం ప్రతినిధులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: "కాళేశ్వరం... రైతుల కాళ్లు కడిగి, కన్నీళ్లు తుడుస్తుంది"