వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామనుకున్నారు.. ఇలా గోదారమ్మ తనలోనే దాచుకుంటుందని కలలో కూడా అనుకోలేదు.. ‘మా తల్లి బంగారు కొండ’ను ఇక నువ్వే భద్రంగా చూసుకోవమ్మా అంటూ ఆవిరైన ఆశలతో నీళ్లు ఇంకిన కళ్లతో నదీమతల్లి వినేలా రోదిస్తున్నారు. గోదారి ఒడిలో కూతురు మూగబోయి కనుమరుగైతేే వదిలి రాలేక.. ఇక రాదనే నిజాన్ని జీర్ణించుకోలేక తీరాన్ని విడిచి రాలేకపోతున్నారు.
గత నెల 15న పాపికొండల విహార యాత్రలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన యువ అభియంత కారుకూరి రమ్య తల్లిదండ్రుల వేదన ఇది... మంచిర్యాల జిల్లా తాండూరులో నేటికీ ఆ విషాదం కనిపిస్తూనే ఉంది.
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి పడవ ప్రమాదంలో గల్లంతైన 22 ఏళ్ల రమ్యను కడసారి చూసుకోవాలన్న తాపత్రాయంతో గత 40 రోజులుగా తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారు. మంగళవారం బోటును వెలికితీయగా అందులో మరో ఎనిమిది మృతదేహాలు లభించాయి. వాటిలోనూ రమ్య మృతదేహం కనిపించలేదు. చివరి ఆశలు కూడా ఆవిరైపోతున్నాయని తెలిసినా ఇంకా ఏదో ఆశ వారిని అక్కడి నుంచి కదలకుండా చేస్తోంది. రమ్య మృతదేహం కోసం తల్లిదండ్రులకు తోడుగా వెళ్లిన బంధువుల్లో కొందరు వెనుదిరగగా వారు మాత్రం బిడ్డ ధ్యాసలో అక్కడే ఉండి ఎదురుచూస్తున్నారు.