మంచిర్యాల జిల్లా మందమర్రి(Mandamarri)లో మూతపడిన ఓ ప్రైవేట్ పాఠశాల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇటీవల గురుకులం, ఆదర్శ జ్యోతిబాపూలే నవోదయ పాఠశాలలో చేరేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను పాఠశాలలో సమర్పించారు. సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రధాన ఉపాధ్యాయులకు అనుమానం వచ్చి ఆరా తీయగా అవి నకిలీ ధ్రువీకరణ (Fake Certificates)పత్రాలుగా తేలాయి. 12 ఏళ్ల క్రితం మూతపడిన ప్రగతి విద్యానికేతన్ పాఠశాల నుంచి విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు అధికారులు గుర్తించారు.
ఇలా నకిలీ ధ్రువ పత్రాలతో గురుకుల పాఠశాలలో సీటు పొందిన 15 మంది విద్యార్థుల సీట్లను రద్దు చేసినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మూతపడిన ప్రగతి విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యంపై మండల విద్యాశాఖ అధికారి పోచయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేసేందుకు చర్యలు ప్రారంభించారు. కోల్బెల్ట్ ప్రాంతంలో గత కొన్ని ఏళ్లుగా ఈ దందా కొనసాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: creative ways to save money: వయసు 37 ఏళ్లు.. పొదుపు రూ.10 కోట్లు.. ఎలా సాధ్యమైందంటే?