మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి నివాసంలో పేద ముస్లిం కుటుంబాలకు కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం సీపీ సత్యనారాయణ సరుకులు అందించారు. ఐజా కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. లాక్డౌన్ సందర్భంగా రంజాన్ మాసం పేద ముస్లింలకు ఇబ్బందిగా మారిందని కళాశాల యాజమాన్యం తెలిపింది. తమ వంతు సాయంగా సీపీ సత్యనారాయణ సమక్షంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని యాజమాన్యం పేర్కొంది.
సుమారు 1500 మంది నిరుపేద ముస్లింల ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరకులను అందిస్తామని వివరించింది. ఐజా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పేద ముస్లింలకు పంపిణీ చేస్తామని యాజమాన్యం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించడం తప్పనిసరని పేర్కొంది. రంజాన్ మాసం సందర్భంగా దీక్షలు జరుపుకునే వారికి నెలకు సరిపడా వంట సామగ్రి అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.