ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనను వామపక్షాల మద్దతుతో అడ్డుకుంటామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్పష్టం చేశారు. మంచిర్యాలలో సీపీఐ రాష్ట్ర నిర్మాణ సభలకు డి.రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసులు, ప్రభుత్వ నిర్బంధాలను అధిగమిస్తూ ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తామని రాజా ఉద్ఘాటించారు
అన్ని దేశాలపై అమెరికా ఆధిపత్యం చెలాయించేందుకు చూస్తోందన్నారు. ట్రంప్ పర్యటన వల్ల దేశ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్నారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ద్వయం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజ, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. వామపక్ష భావజాల పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి యువజన సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు డి.రాజా తెలిపారు.