మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కరోనా బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. హనుమాన్ బస్తీకి చెందిన జలజ ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె భర్త మొండయ్యకు ఈనెల రెండో తేదీన కరోనా సోకింది. మొదట బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో చేరాడు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
జలజ ఈనెల నాలుగో తేదీన కొవిడ్ బారిన పడ్డారు. అప్పట్నుంచి ఆమె హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. భర్తతో పాటు తనకూ కరోనా సోకిందన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మొండయ్యకు జలజ రెండో భార్య. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కొవిడ్ సోకడం వల్ల ఎవరూ భయపడొద్దని వైద్యులు చెబుతున్నారు. కరోనా రాకుండా జాగ్రత్త తీసుకోవాలని.. ఒకవేళ వస్తే.. హోం ఐసోలేషన్లో ఉండాలన్నారు. పరిస్థితి ఇబ్బందిగా ఉంటే ఆస్పత్రికి వెళ్లాలని చెప్పారు. అంతేకాని ఆత్మహత్యకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా ఉగ్రరూపం: దేశంలో మరో 1,84,372 కేసులు