మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం రాజారాం గ్రామానికి చెందిన బురుస శిరీష అనే మహిళకు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. శస్త్రచికిత్స చేయాల్సి ఉండటంతో చెన్నూరు ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
వైద్యుల సలహా మేరకు శిరీషను అంబులెన్స్‌లో చెన్నూరు ఆసుపత్రికి తరలిస్తుండగా.. గొర్లపల్లి వాగు వద్ద వాహనం ఆగిపోయింది. బురదలో చిక్కుకుపోయింది. దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి.. సమీపంలోని నీల్వాయి గ్రామ సర్పంచ్, మరికొంత మంది యువకులు అండగా నిలిచారు. అంబులెన్స్‌లో ఉన్నవారిని కిందకు దింపి.. అతి కష్టం మీద అంబులెన్స్‌ను ఒడ్డుకు చేర్చారు. నిండు గర్భిణీని చేతుల మీద మోస్తూ వాగు దాటించారు. అనంతరం అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న మరో అంబులెన్స్‌లో శిరీషను చెన్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వైద్యులు శస్త్రచికిత్స చేయడంతో శిరీష ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా గొర్లపల్లి వాగు వద్ద అప్రోచ్ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.