రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లు చేసిందని అబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. చేతికొచ్చిన ప్రతి గింజను కొంటామని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని హన్వాడ మండలం కొనగట్టు, కోయనగర్, ఏనుగొండ తదితర కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకురావొద్దని మంత్రి సూచించారు. గ్రామంలోనే కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వరి ధాన్యం క్వింటాలుకు ఏ గ్రేడ్ రకం 1835 రూపాయలు, సాధారణ రకానికి 1815 రూపాయలు మద్దతు ధర చెల్లిస్తున్నట్లు ఆయన చెప్పారు.
కిరాణా సామాగ్రి పంపిణీ...
ఏనుగొండలో అరుంధతి ఉద్యోగ బంధు సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను మంత్రి పంపిణీ చేశారు. కోయనగర్‌లో పేదవారికి ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర కిట్లను అందించారు. అనంతరం పట్టణంలోని నిత్యావసర వస్తువుల దుకాణాల యజమానులతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. మాస్కులు ఉన్న వాళ్లనే దుకాణాల వద్దకు రానివ్వాలని, వ్యక్తిగత దూరం కచ్చితంగా పాటించాలని మంత్రి సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. స్పందించకపోతే దుకాణాలు సీజ్ చేయాలని సంబంధిత అధికారులకు చెప్పారు. మహబూబ్ నగర్‌ను జీరో కరోనా జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని కోరారు. జిల్లా ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ కరోనాను దగ్గరకు రాకుండా తరిమి కొట్టాలని వివరించారు. భౌతిక దూరం పాటిస్తూ...ప్రజలంతా నివాసాల్లో ఉండటమే ప్రభుత్వానికి ప్రజలిచ్చే బహుమానమని మంత్రి అన్నారు.