Jupalli Krishna Rao latest news : జూపల్లి కృష్ణారావు.. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా సహా రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన సీనియర్ రాజకీయ నాయకుడు. బీఆర్‌ఎస్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో తదుపరి అడుగులు ఎటువైపు అన్న అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. జూపల్లి కృష్ణారావు బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి.. 1999లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొల్లాపురం నియోజకవర్గం నుంచి నిలబడి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2004, 2009, 2012, 2014లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఐదుసార్లు వరుసగా ఎన్నికైన శాసనసభ్యుడిగా రికార్డు సాధించారు.
Jupalli Krishna Rao next step : 1999, 2009లో కాంగ్రెస్ నుంచి గెలువగా, 2004లో స్వతంత్ర్య అభ్యర్థిగా, 2012 ఉప ఎన్నికలతో పాటు 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. వైఎస్సార్ మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా, కిరణకుమార్‌రెడ్డి కేబినెట్‌లో దేవాదాయశాఖ మంత్రిగా, కేసీఆర్ మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పని చేశారు. మంత్రిగా పని చేసినందున ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆయనకు అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక అనుచరగణం ఉంది. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో జూపల్లి ఓడిపోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో హర్షవర్ధన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీలో జూపల్లి ప్రాధాన్యం తగ్గుతూ రాగా.. చివరకు సస్పెన్షన్‌కు దారితీసింది.
ఆ 2 జిల్లాల్లోనూ మంచి పట్టు..: జూపల్లిని బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో ఆయనతో కలిసేదెవరనే చర్చ రాజకీయవర్గాల్లో నెలకొంది. కొల్లాపూర్ నియోజకవర్గం నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలో ఉంటుంది. ఈ 2 జిల్లాల్లోనూ ఆయనకు మంచి పట్టుంది. ఈ నియోజకవర్గంలోని పలువురు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఆయన అనుచరులు జూపల్లి వెంట నడిచే అవకాశాలు ఉన్నాయి. తొలి నుంచి నిరంజన్ రెడ్డి-జూపల్లికి మధ్య అభిప్రాయ బేధాలున్నాయి. ఇటీవల మంత్రి నిరంజన్‌రెడ్డిపై వనపర్తి జడ్పీ ఛైర్‌పర్సన్, పలువురు ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తిరుగుబావుటా ఎగురవేశారు. అసమ్మతి నేతలు ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరలేదు. వారిలో కొందరు జూపల్లి వెంట ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.
ఆ అందరినీ కలుపుకుని..: దీంతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలకు అక్కడక్కడ అసమ్మతి రాగం వినపడుతోంది. ప్రస్తుతం బయట పడకపోయినా జూపల్లి వీరందరిని కలుపుకోని పోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో తన ముద్ర ఉమ్మడి జిల్లాపై ఉండాలన్న ప్రణాళికతో జూపల్లి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో తన గెలుపునకు అవకాశాలు ఉండే రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే ఆయన ప్రణాళిక ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ఏడాదిలో తాజా పరిణామాలతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే రాజకీయ వేడి ప్రారంభమైంది.
కొత్త పార్టీ పెడతారా.. పాత వాటిల్లో చేరతారా..? ఇక జూపల్లి కొత్త పార్టీ పెడతారా.. లేదా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీల్లో చేరతారా అనే అంశంపై జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికార పార్టీపై ఇప్పటికే చాలాసార్లు ఎదురుదాడికి దిగిన జూపల్లి, ఏ పార్టీలోకి వెళ్తారన్న అంశంపై చిన్న సంకేతం కూడా వదల్లేదు. కార్యకర్తలు, అభిమానులు, అనుయాయులు ఏం నిర్ణయిస్తే అటే తన పయనమని సమాధానమిస్తూ వస్తున్నారు. బీఆర్‌ఎస్ సస్పెండ్ చేసిన నేపథ్యంలో పార్టీ మార్పుపైనా కొద్ది రోజుల్లోనే ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవీ చూడండి..