మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ప్రతి బుధవారం ఉల్లి క్రయ విక్రయాలు జరుగుతాయి. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో ఉల్లి సాగు చేసే రైతులు.. అత్యధిక డిమాండ్ ఉండే దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ విక్రయించేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ మార్కెట్కు దేవరకద్ర, కోయిలకొండ, మరికల్, మక్తల్, నర్వ, అమరచింత , నారాయణపేట, ఊట్కూరు తదితర మండలాల నుంచి రైతులు పండించిన ఉల్లిని విక్రయించేందుకు తీసుకొస్తుంటారు.
రూ. 1,000- 1,500లకు తగ్గిన క్వింటా ఉల్లి
గత ఏడాదితో పోలిస్తే ఉల్లి ధరలు మార్చి నెలలో తగ్గినా.. ఏడాదికి పెట్టుబడులు భారీ పెరిగాయని, కూలీల రవాణా ఖర్చులు పెరిగిన స్థాయిలో ఉల్లి ధరలు పెరగడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి 17న క్వింటా ఉల్లి ధర కనిష్టంగా రూ. 3,100 నుంచి రూ. 4,200 వరకు కొనసాగగా.. మార్చి మొదటి వారంలోనే క్వింటాకు రూ.1,000 నుంచి రూ. 1,500 వరకు తగ్గి. కనిష్ట ధర రూ.1,000, నుంచి గరిష్ట ధర రూ. 2,100 కు చేరుకోవడం ఉల్లిగడ్డ ధరలు తగ్గుదలను సూచిస్తుంది.
ఉల్లి రైతుల గోడు...
వర్షాకాలంలో చేతికొచ్చిన పంట అధిక వర్షాలతో పండిన చోటనే మురిగిపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడైనా ఉల్లి ధరలు బాగున్నాయని సాగు చేస్తే పంట చేతికొచ్చే సమయంలో ధరలు భారీగా తగ్గడం, ధరల రూపంలో తాము తీవ్ర నష్టాల్లోకి వెళ్లినట్లు ఉల్లి రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఉల్లి ధరలు అకస్మాత్తుగా తగ్గడం.. వినియోగదారులకు ఊరటనిచ్చినా.. సాగు చేసిన రైతులకు మాత్రం కన్నీళ్లు తప్పడం లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీసం క్వింటా ఉల్లికి రూ. 3,000కు తగ్గకుండా చూడాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎం కేసీఆర్