రోడ్డు విస్తరణలో భాగంగా దారికి అడ్డంగా ఉన్న చెట్లు, వృక్షాల తొలగింపు సాధారణమే. పర్యావరణ నిబంధనలు పాటిస్తూ రోడ్డు నిర్మాణ సంస్థలు వాటిని తొలగిస్తాయి. కానీ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం ఏనుగొండ చౌరస్తాలో.. దశాబ్దాలకాలంగా విస్తరించిన మర్రిచెట్టును మాత్రం అధికారులు తొలగించలేకపోతున్నారు. మర్రిచెట్టుతో ఉన్న అనుబంధాన్ని అక్కడి ప్రజలు తెంచుకోలేకపోవడమే అందుకు కారణం.
జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వరకూ విస్తరిస్తున్న జాతీయ రహదారికి ఆనుకొని.. ఏనుగొండ చౌరస్తా వద్ద ఈ మర్రిచెట్టు ఉంది. మర్రిచెట్టు కింద పోచమ్మ, పక్కనే ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. ఈ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా.. ఈ మర్రిచెట్టు వద్దకే వచ్చి మాట్లాడుకుంటారు. తాతల కాలం నుంచి తమ కష్టసుఖాలు చెప్పుకుంటారు. ఈ ఆనవాయితీ ఇలాగే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు రోడ్డు విస్తరణలో భాగంగా మర్రిచెట్టు, ఆలయాన్ని తొలగించాలని అధికారులు తెలిపారు. అందుకు అంగీకరించని గ్రామస్థులు.. మర్రిని తొలగిస్తే ఊరుకునేదే లేదని తేల్చి చెబుతున్నారు.
ప్రజలు వ్యతిరేకించడంతో అంగీకరించిన అధికారులు.. మరోసారి గ్రామానికి రాలేదు. రోడ్డు విస్తరించాలంటే మర్రిచెట్టును తొలగించాల్సిందేనని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలపగా.. జిల్లా అధికారులు మూడు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. చెట్టును పూర్తిగా తొలగించి అర్బన్ ఏకో పార్కులో యధావిధిగా నాటడం. వందల ఏళ్ల నాటి చెట్టు కావడంతో నిపుణులు చెట్టు బతుకుతుందనే హామీ ఇవ్వలేకపోతున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న సగభాగాన్ని తొలగించి మరో సగభాగాన్ని అలాగే ఉంచాలని ప్రతిపాదించారు. చివరకూ చెట్టును నరికి వేయకుండా అలాగే ఉంచాలని నిర్ణయించారు. ఎన్హెచ్ఏఐ అధికారులు మాత్రం చెట్టు తొలగించాలని కోరుతున్నారు. చెట్టును దైవంగా భావిస్తున్న గ్రామస్థులు.. ఆలయం, చెట్టును తొలగించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: Haritha Haram: వెల్దుర్తి త్రీ ఇడియట్స్... అసలైన హరితమిత్రులు