పర్యావరణ పరిరక్షణ, మానవ మనుగడ కోసం మొక్కలు నాటడాన్ని ప్రజలు దైవకార్యంగా భావించాలని పద్మశ్రీ వనజీవి రామయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బొటానికల్ గార్డెన్లో రామయ్య దంపతులు మొక్కలు నాటారు.
యువత సైన్స్‌ను నమ్మాలని, మొక్కలు నాటడమూ సైన్సేనని రామయ్య వ్యాఖ్యానించారు. కాలుష్యం తగ్గించే దిశగా బయో ఇంధనాలు రావాలని ఆకాంక్షించారు. ఆహారం, వర్షాలు, ఆక్సిజన్, జీవవైవిధ్యం ఇలా జీవకోటికి అవసరమైన ఎన్నింటినో మొక్కలు తీర్చగలవని అందుకే ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాదు... వాటిని సంరక్షించడం కూడా బాధ్యతగా భావించాలని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ చేయూత నివ్వాలని, తెలంగాణలో కోట్ల మొక్కలు పెరగడానికి దోహదం చేయాలన్నారు. విత్తనం వృథాగా పోకూడదని, మొక్కగా పురుడుపోసుకోవాలన్నారు. మొక్కలను పెట్టుబడిగా పెడితే.. దీర్ఘకాలంలో తరతరాలకు కావాల్సిన అనంత ఫలాలు అందిస్తాయని ఆయన గుర్తు చేశారు.
ఇదీ చదవండి : గజ్వేల్‌లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం