రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని.. ఆత్మ గౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణలో దళితులకు కనీస గౌరవం దక్కడం లేదని టీపీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షులు ప్రీతమ్ ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్లారం గ్రామానికి చెందిన రాజాబాబు హత్య ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని... రాజాబాబు దారుణ హత్యకు, నిత్యం దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 26 "చలో మల్లారం" కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు.
దళితులను కాపాడేందుకు చట్టాలున్నా.. అవి దళితులకు న్యాయం చేసే దిశగా అమలు కావడం లేదని రోపించారు. దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని.. దళితులంతా ఏకతాటిపై నిలిచి.. న్యాయం కోసం పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా దళితుల రక్షణకై నిర్వహించే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్బంగా "చలో మల్లారం" పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.
ఇదీ చదవండి: నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!