Ticket War in Congress Party Mahabubnagar District : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్‌లో(Telangana Congress) అసమ్మతి భగ్గుమంటోంది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సరితకు అభ్యర్ధిత్వం ఖరారు చేయడంపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సరితకు టిక్కెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, సహా గద్వాల, కేటీదొడ్డి, గట్టు సహా వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, 200 మంది కార్యకర్తలు బుధవారం పార్టీకి రాజీనామా చేశారు.
Ticket Clashes in Congress Party : డీసీసీ కార్యాలయం వద్ద ఉన్న పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను చించి తగులబెట్టారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టిక్కెట్లు అమ్ముకోవడం వల్లే తాము రాజీనామా చేస్తున్నట్లు పటేల్ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. డీకే అరుణ లాంటి కీలక నేతలు పార్టీ వదిలి వెళ్లినా.. తాము మాత్రం పార్టీని పట్టుకునే ఉన్నామని, అలాంటి తమను కాదని ఇటీవలే ఇతర పార్టీలోంచి వచ్చిన వారికి టిక్కెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పటేల్ ప్రభాకర్ రెడ్డి రాజీనామా విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన్ని బీఆర్ఎస్ చేరాల్సిందిగా కోరగా... రాత్రి మంత్రి హరీశ్ రావు సమక్షంలో భారాసలో చేరారు. గద్వాల నియోజక వర్గం నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ కురువ విజయ్ సైతం.. గాంధీ భవన్లో రేవంత్‌కు వ్యతిరేకంగా ప్లకార్టులు ప్రదర్శించి, నివాదాలు చేశారు. దీంతో క్రమశిక్షణ కమిటి ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
Telangana Assembly Elections 2023 : ఇన్నేళ్లు పార్టీని వెన్నంటి ఉన్న నాయకులను కాకుండా కొత్తగా పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు కట్టబెట్టడంపై.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో హస్తం పార్టీలో అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొల్లాపూర్ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఆ నియోజకవర్గ ఇంచార్జ్ చింతలపల్లి జగదీశ్వరరావు.. ఇప్పటికే ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ నుంచి టిక్కెట్ కోరిన సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి సైతం పీసీసీ అధ్యక్షుడు, అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ప్రస్తుతం ఆయన వేచిచూసే ధోరణిని అనుసరిస్తున్నారు. జానారెడ్డి, ఠాక్రే , చిన్నారెడ్డికి తన వైఖరిని స్పష్టం చేసిన నాగం.. వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఆయన కూడా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఉమ్మడి పాలమురు జిల్లాలో ప్రకటించిన 8 స్థానాల్లో 4 వలస నాయకులకే దక్కిన నేపథ్యంలో మిగిలిన ఆరింటిలోనూ వారికే టిక్కెట్టు దక్కుతుందా అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.