Mahabubnagar Kidnaps: మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తుల అదృశ్యం, అరెస్టుల వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. తమవారిని ఎక్కడికి తీసుకెళ్లారన్న అంశంపై వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్, భాజపా నేతలు సైతం అరెస్టులను ఖండించడం, పోరాటాలకు సిద్ధమవవడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. ముగ్గురు వ్యక్తుల అదృశ్యం, ఆ తర్వాత అరెస్టు వ్యవహారం మరిచిపోకముందే దిల్లీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటి నుంచి మహబూబ్‌నగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవితోపాటు మరో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లడం కలకలం రేపింది.
రాజకీయ కోణంలోనే...
మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు గత బుధవారం, యాదయ్య, విశ్వనాథ్‌లు గురువారం అదృశ్యమయ్యారు. స్థానిక ఠాణాలో వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రాజకీయ కారణాలతో వారి అదృశ్యం జరిగిందని ప్రచారం సాగింది. హైదర్ అలీ అనే వ్యక్తిపై ఆ ముగ్గురూ హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చూపి.. ఆదివారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తమవారిని అక్రమంగా అరెస్టు చేశారంటూ వారి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. పచ్చని పాలమూరులో రాయలసీమ సంస్కృతిని తీసుకొస్తున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో హైదర్ అలీ ఉన్న ఫొటోలున్నాయంటూ విలేకరులకు కాంగ్రెస్ నేత వెంకటేశ్ చూపించారు. రాజకీయ కోణంలోనే ముగ్గురూ అదృశ్యమయ్యారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.
మున్నూర్ రవి అపహరణ...
మహబూబ్‌నగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మున్నూర్ రవి దిల్లీలో అపహరణకు గురయ్యారు. మహబూబ్‌నగర్‌లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ.. వాటిపై కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు సహచరులతో కలిసి రవి గత శనివారం దిల్లీకి వచ్చారు. సౌత్ అవెన్యూలోని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి చెందిన ప్లాట్‌లో ఉంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. తమకు జితేందర్‌రెడ్డి నివాసం దొరకడం లేదని ఫోన్‌లో సంప్రదించారు. ఏడెనిమిది మంది ఆగంతుకులు ఒక్కసారిగా చొరబడి రవిని, ఇద్దరు సహచరులను, జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపానూ బలవంతంగా కార్లలోకి ఎక్కించుకొని వెళ్లిపోయారు.
సీసీటీవీ ఫుటేజీలో రికార్డు...
మంగళవారం జితేందర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాజు వచ్చిచూడగా థాపా, మున్నూర్ రవి, ఆయన సహచరులు లేకపోవడం... దుస్తులు చిందరవందరగా ఉండడంతో వెంటనే సౌత్ అవెన్యూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఏడెనిమిది మంది వ్యక్తులు వచ్చి బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.
ఇదీ చూడండి: