Machine for removing garbage: మహబూబ్ నగర్‌లోని పెద్దచెరువులోకి ప్రధాన కాల్వల ద్వారా వరద, మురుగునీరు వచ్చి చేరుతుంది. ఇందులోనే అనేక వ్యర్థాలు వేస్తుంటారు. ఆహారం, ప్లాస్టిక్, కాగితం, కర్ర, చెత్త ఇలా ఎన్నో కొట్టుకుని వస్తుంటాయి. వ్యర్థాలతో కొన్నిచోట్ల కాల్వలు మూసుకుపోతాయి. చెరువులోకి అన్ని రకాల వ్యర్థాలు చేరి నీరు కలుషితం అవుతుంది. కాల్వలు శుభ్రంగా ఉంటే వరద వ్యర్థాలు లేని నీరు చేరుతుంది. ఇదే ఉద్దేశంతో పెద్ద చెరువుకు వరదనీరు మోసుకెళ్లే మూడు ప్రధాన కాల్వలపై కృత్రిమ మేధతో... చెత్తను ఏరివేసే స్వయంచాలిత రోబోటిక్ యంత్రాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.
మానవ రహిత యంత్రం
NV robotics innovated robotic machine: ఈ యంత్రంలో ముందుగా కాల్వకు అడ్డంగా వ్యర్థాలు కొట్టుకుపోకుండా జాలిలాంటి నిర్మాణాన్ని అమర్చుతారు. మధ్యలో ఓ బకెట్ లాంటి జాలి ప్రత్యేకంగా ఉంటుంది. కొట్టుకు వచ్చిన వ్యర్థాలు నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న బకెట్ లాంటి నిర్మాణంలో చేరుతాయి. నిర్ణీత పరిమాణం, బరువు ఉన్న చెత్త అందులో చేరగానే కృత్రిమమేధతో గుర్తించి ఆ చెత్తను ఎత్తి పక్కనే ఉన్న బుట్టలో పోస్తుంది. మళ్లీ యథాస్థానానికి చేరుకుంటుంది. నీటిపైనే తేలియాడే చెత్తతో పాటు కొట్టుకుపోయే వ్యర్థాలనూ యంత్రం ఏరివేస్తుంది. మనుషుల అవసరం లేకుండానే కేవలం విద్యుత్ కనెక్షన్ ద్వారా ఈ యంత్రం పని చేస్తుంది. రోజుకు సుమారు 10టన్నుల చెత్త సేకరించగలదని తయారీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచంలో మొదటిసారిగా ఈ తరహా యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఎన్వీ రోబోటిక్స్ సీఎండీ పద్మ వెల్లడించారు.
ఇది రోబోటిక్ యంత్రం. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(Artificial intelligence) సహకారంతో పనిచేస్తుంది. మురికి కాల్వలోకి చేరిన చెత్తను ఈ యంత్రం సునాయాసంగా తీసుకుని.. ఇనుప బకెట్లో వేస్తుంది. బకెట్ నిండగానే.. పక్కనే ఉన్న బుట్టలో పోసి.. మళ్లీ యథాస్థానానికి చేరుకుంటుంది. విద్యుత్ ఖర్చు కూడా ఎక్కువ ఉండదు. నీళ్లపైన తేలియాడే చెత్త, లోపల పేరుకుపోయిన వ్యర్థాలను కూడా తొలగిస్తుంది. మహబూబ్‌నగర్ పెద్ద చెరువుకు వ్యర్థాలు ఎక్కువగా రావడంతో అదనపు కలెక్టర్ విజ్ఞప్తి మేరకు.. ఈ యంత్రాన్ని రూపొందించాం. -పద్మ, ఎన్వీ రోబోటిక్స్ సీఎండీ
విద్యుత్ ఖర్చు ఉండదు
Robotic machine for removing garbage: ఈ యంత్రాన్ని అవసరాన్నిబట్టి తయారు చేసి ఇస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. నీటి ప్రవాహం, అందులో కొట్టుకొచ్చే చెత్త పరిమాణాలను దృష్టిలో ఉంచుకుని తయారుచేసి అమర్చుతారు. బకెట్లో ఎంత పరిమాణంలో చెత్త చేరగానే ఎత్తివేయాలి.? ఎంత బరువు చేరగానే ఎత్తివేయాలి.? అనే అంశాలను అందులో అవసరాన్ని బట్టి నిక్షిప్తం చేయవచ్చు. సెన్సార్ల ద్వారా వాటిని గుర్తించి బకెట్ చెత్తను ఎత్తి పక్కన బుట్టలో పోస్తుంది. ఇందుకు మానవ వనరుల అవసరం ఉండదు. విద్యుత్‌కు సైతం పెద్దగా ఖర్చుండదు. ఎంత చెత్తవచ్చినా ఎప్పటికప్పుడు ఎత్తివేయడం దీని ప్రత్యేకత. అధికారుల సూచన మేరకు మహబూబ్‌నగర్‌లో మూడు చోట్ల ఏర్పాటు చేస్తున్నామని పద్మ తెలిపారు. ఈ యంత్రం విజయవంతమైతే మహబూబ్‌నగర్ పెద్దచెరువుకు వ్యర్థాలు లేని నీరు వచ్చి చేరుతుంది.
ఇదీ చదవండి: Lung transplant surgery: నిమ్స్‌లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స
telangana in parliament : స్థానిక సంస్థలకు ఆరేళ్లలో రూ. 8,587 కోట్లు