షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు చిలకమర్రి నరసింహ అన్నారు. అధికారులతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన సమీక్ష నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలపై దాడుల నివారణకు ఉద్దేశించి తీసుకొచ్చిన చట్టంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు.
గ్రామాల్లో ఎస్సీలపై దాడులు జరగకుండా ప్రజా ప్రతినిధులు చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో 35 శాతం ఉన్న షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ధి కోసం ఆయా పథకాల కింద ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల్లో నిర్దేశించిన వాటాను తప్పనిసరిగా ఖర్చు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. ప్రతి అధికారి చిత్తశుద్ధితో, బాధ్యతయుతంగా పనిచేయాలని సూచించారు.
విద్యుత్ బిల్లులకు సంబంధించి 100 యూనిట్ల లోపు వినియోగించిన ఎస్సీ, ఎస్టీలు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని... ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇస్తే సరిపోతుందని తెలిపారు. ఎస్సీలపై దాడులు జరిగినప్పుడు నిందితులకు బెయిలు ఇవ్వకుండా చూడడంతో పాటు.. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నెలకొకసారి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే రుణాల విషయంలో బ్యాంకు అధికారులు డిపాజిట్ చేయించుకుంటున్నారని, ముందస్తు డిపాజిట్ లేకుండా నేరుగా రుణాలు ఇచ్చే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ప్రయోగాలు ఇలా