ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గుండ్య, ఇబ్రహీంబాద్, రామనూతల్, చెరుకూరు, పాదకల్, సంతెపూర్, ముదివేను రక్షిత అటవీ ప్రాంతాల్లో దాదాపు 2500 ఎకరాల్లో క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్ ఖనిజాలు ఉన్నట్లు టీఎస్ఎండీసీ గుర్తించింది. 14 ఏళ్ల క్రితమే దరఖాస్తు చేసినప్పటికీ ముందుకు వెళ్లలేదు. తాజాగా ఆ ప్రతిపాదనను టీఎస్ఎండీసీ మళ్లీ తెరపైకి తెచ్చింది. అటవీ శాఖతో కలిసి జూన్, జులై మాసాల్లో నల్లమల అడవుల్లో టీజీపీఎస్ సర్వే చేసింది. ఏడు ప్రాంతాల్లో 195 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఖనిజాలు పెద్ద మొత్తంలో ఉన్నాయని... తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది. పరిమాణం ఎంతన్నది తేలనప్పటికీ భారీ మొత్తంలో ఉంటాయని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. సర్వేలో భాగంగా అధికారులు ఈ ఖనిజాల నమూనాలు సేకరించారు. గతంలో మార్బుల్, గ్రానైట్‌కు ఆదరణ ఉండగా... ఇప్పుడు వాటి స్థానంలో క్వార్ట్జ్ స్టోన్ వచ్చి చేరింది. షాపింగ్ కాంప్లెక్లులు, మాల్స్, విమానాశ్రయాల్లో... అదేవిధంగా గాజు, సిరామిక్ పరిశ్రమల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు.
తవ్వకాలే తరువాయి....
సర్వే పూర్తికావటం... మేలి రకం, భారీ పరిమాణంలో ఖనిజ నిల్వలు ఉన్నట్లు తేలటం వల్ల ఇక తవ్వకాలే తరువాయి. అటవీ భూముల్ని బదలాయించేందుకు అటవీ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కోల్పోయే అటవీ ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూములను కేటాయించి, పరిహారం చెల్లించాల్సి ఉంది. అయితే 2015 లోనే దరఖాస్తు చేసిన దృష్ట్యా... అనుమతులు త్వరగా వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. తవ్వకాలు చేపడితే నల్లమల అటవీ ప్రాంతంపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు వివిధ రకాల వన్యప్రాణులకు నిలయం నల్లమల. యురేనియం అన్వేషణపై స్థానికులు, పర్యవరణ వేత్తలు, రాజకీయ పార్టీల నేతల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. క్వార్ట్జ్ వెలికితీసేందుకు ఎంపిక చేసిన ప్రాంతాలు దట్టమైన అడవులు కావని... టైగర్ రిజర్వుకు వెలుపలే ఉన్నాయని టీఎస్ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి: మిషన్ భగీరథ స్ఫూర్తితో... హరిత ఉద్యమం