Eetela Rajender: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. ప్రత్యామ్నాయ శక్తిగా భాజపా అవతరించబోతోందని స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 8 ఏళ్ల మోదీ పాలనపై జరిగిన ప్రజా సంక్షేమ పాలన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్కు ఓటేసినా.. తెరాసకు ఓటేసినా సీఎం కేసీఆరే తిరిగి అధికారంలోకి వస్తారని ప్రజలు నమ్ముతున్నారని రాజేందర్ అన్నారు. అందుకే ప్రజలు భాజపా మాత్రమే ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయమని భావిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని అందిపుచ్చుకునేలా భాజపా శ్రేణులు పని చేయాలని సూచించారు.
ప్రజల నాడి తెలిసిన కేసీఆర్కు ఇప్పుడు పీకే అవసరం ఎందుకొచ్చిందో ప్రజలు ఆలోచించాలని రాజేందర్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులను ప్రజలు తిరస్కరించడం లేదని.. కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని, అసమర్థ పాలనను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిస్తే ఆ ఘనతంతా తనదేనని చెప్పుకునే కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఎదురైనా బాధ్యత వహించాలన్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న వారికి తెరాసలో టికెట్ నిరాకరించాల్సి వస్తే.. ముందుగా కేసీఆర్కు టికెట్ దక్కదని అభిప్రాయపడ్డారు. ఆరిపోయే దీపంలాంటి తెరాస కోసం.. అధికారులు, పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా పని చేయొద్దని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఉద్యమ సమయంలో ఉపవాసాలుండి పని చేశానని చెప్పిన కేసీఆర్కు.. అధికారంలోకి వచ్చాక హూజుర్నగర్ ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు రూ.600 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు.
తెలంగాణ సొమ్ము దానం చేసే హక్కు కేసీఆర్కు ఎక్కడిది..: కరీంనగర్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులను ఆదుకోలేని కేసీఆర్.. పంజాబ్లో రైతులను ఆదుకునేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని ఈటల ఎద్దేవా చేశారు. పేరు, ప్రతిష్ఠల కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టుకోవాలే తప్ప.. తెలంగాణ సొమ్ము దానం చేసే హక్కు కేసీఆర్కు ఎక్కడిదని ధ్వజమెత్తారు. జీతాలిచ్చేందుకు డబ్బులు లేని సర్కారు.. రూ.250 కోట్లు వెచ్చించి ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. రూ.40 వేల కోట్ల మద్యం ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ సర్కారు.. ఆ రూ.40 వేల కోట్లు ఎంత మంది యువకులు, తల్లిదండ్రులు, భార్యాపిల్లల ప్రాణాలు హరించాయో తెలుసుకోవాలన్నారు.
రాబోయే ఎన్నికల్లో తెరాస ఓడిపోవటం ఖాయం. ప్రజలంతా భాజపావైపే చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని అందిపుచ్చుకునేలా భాజపా శ్రేణులు పని చేయాలి. ఆరిపోయే దీపంలాంటి తెరాస కోసం.. అధికారులు, పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా పని చేయొద్దు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.-ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
ఇవీ చూడండి..
Jubileehills gang rape case: ముగిసిన సీన్ రీ-కన్స్ట్రక్షన్.. జూబ్లీహిల్స్ ఠాణాకు నిందితులు