కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల జలాశయం చెంత మరో రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదన రూపుదాల్చుతోంది. 20.5 టీఎంసీల సామర్థ్యంతో నెట్టెంపాడు పేరుతో ప్రతిపాదిస్తున్న రెండో జలాశయం నుంచే గట్టు ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించనున్నారు. నాలుగు టీఎంసీల నుంచి 15 టీఎంసీల సామర్థ్యానికి పెరిగిన గట్టు ఎత్తిపోతల పథకానికి 2018 జూన్ 29న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. తాజాగా నెట్టెంపాడు జలాశయ నిర్మాణ ప్రతిపాదనలతో గట్టు సామర్థ్యాన్ని మళ్లీ నాలుగు టీఎంసీలకు కుదించాలని భావిస్తున్నారు. జూరాల నుంచి రెండు ఎత్తిపోతల ద్వారా రెండు జలాశయాలను నింపేలా రూపొందించిన నిర్మాణ రేఖాచిత్రాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. నెట్టెంపాడు, గట్టు జలాశయాల నిర్మాణానికి దాదాపు రూ.6500 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానదిపై ఉన్న జూరాల జలాశయ నిల్వ సామర్థ్యం తగ్గి... తాగు, సాగునీటి అవసరాలకు చాలని స్థితిలో ఈ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.
కొత్త జలాశయం నుంచే ‘గట్టు’కు
ర్యాలంపాడు జలాశయం నుంచి నాలుగు టీఎంసీల సామర్థ్యంతో గట్టు ఎత్తిపోతల పథకం నిర్మించాలని మొదట్లో భావించారు. వరదల సమయంలోనే నీటి ఎత్తిపోతకు వీలుంటుందన్న కారణంతో నేరుగా జూరాల జలాశయం నుంచే నీటిని తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ మేరకు గట్టు సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచి, రూ.4500 కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం 490 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకెళ్లాలంటే విద్యుత్తు వినియోగం అధికమవుతుందనే కారణంతో గట్టు సామర్థ్యాన్ని మళ్లీ 4 టీఎంసీలకు కుదించి 450 మీటర్ల వద్ద నిర్మించేలా డిజైన్ చేస్తున్నారు.
దీనికి జూరాల నుంచి కాకుండా కొత్తగా నిర్మించతలపెట్టిన నెట్టెంపాడు జలాశయం నుంచి నీటిని తీసుకోనున్నారు. ‘గట్టు’ ద్వారా 33 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం.
రివర్సబుల్ టర్బయిన్లతో 60 మెగావాట్ల విద్యుత్తు
గతంలో ప్రతిపాదించిన గట్టు ఎత్తిపోతల ప్రాంతంలో అవసరమైనంత భూమి అందుబాటులో ఉంది. కట్ట నిర్మాణానికి కొండలు అనుకూలంగా ఉన్నాయి. కానీ జూరాల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 400 మెగావాట్ల విద్యుత్తు అవసరమనే కారణంతో దాని నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు సమాచారం. కొత్త ప్రతిపాదనల్లో రెండు ఎత్తిపోతలకు కలిపి 226 మెగావాట్ల విద్యుత్తు వినియోగించే ఏడు పంపులు (5+2) ఏర్పాటు చేయనున్నారు. జూరాల నుంచి 310 మీటర్ల దిగువన నీటిని తీసుకుని 330 మీటర్ల వద్ద నెట్టెంపాడులోకి ఎత్తిపోస్తారు. ఇక్కడి నుంచి జూరాలకు తిరిగి నీటిని తీసుకునే క్రమంలో 60 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అయ్యేలా రివర్సబుల్ టర్బయిన్లను ఏర్పాటు చేయనున్నారు. కొత్త జలాశయం కింద రెండు పంటలు సాగయ్యే 3600 ఎకరాల వరకు భూమి ముంపులో ఉండనుందని అంచనా వేస్తున్నారు.
కొద్ది రోజుల్లో క్షేత్రస్థాయికి ఇంజినీర్ల బృందం
ప్రతిపాదిత జలాశయాలు, ఎత్తిపోతల నిర్మాణ ప్రాంతాలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల్లో ఇంజినీర్ల బృందం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనుంది. మూడు నెలల కిందట విశ్రాంత ఇంజినీర్ల బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సీఎంకు నివేదిక సమర్పించింది. తాజా మార్పు చేర్పుల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఈ నేతృత్వంలో ఇంజినీర్లు జూరాల ప్రాంతానికి వెళ్లనున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా