ఆ గ్రామం పేరు చెబితే.. అక్కడికి ఏ టీచర్ రాడు... ఏ ఉద్యోగీ పనిచేసేందుకు ఇష్టపడరు. అంతెందుకు ఆ ఊరికి పిల్లనివ్వడానిక్కూడా ఎవరూ ముందుకు రారు. ఆ ఊరికెళ్తే ఏట్లోకెళ్లినట్లేనన్నది అందరి భావన. కారణం, ఆ ఊరున్నది కూడా ఏట్లోనే. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో.. కృష్ణానదికి మధ్యలో ఉంటుంది. ఆ ఊరి పేరు గుర్రంగడ్డ. సుమారు వెయ్యికి పైగా జనాభా ఉండే ఈ గ్రామానికి వెళ్లాలన్నా.. గ్రామం నుంచి బయట ప్రపంచానికి రావాలన్నా ఏరు దాటాలి. అప్పట్లో పుట్టిలో ప్రయాణించే వాళ్లు.. ప్రభుత్వం మరబోట్లు సమకూర్చడంతో వాటిలోనే ప్రయాణం సాగిస్తున్నారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని...
ఉదయం ఒకసారి.. సాయంత్రం ఒకసారి ఈ బోటు నడుస్తుంది. రోగం, నొప్పి, అత్యవసరం ఏదోచ్చినా మరబోట్లే గతి. అదీ సాధారణ రోజుల్లోనే. కృష్ణానది పొంగే వానాకాలంలో మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. ప్రమాదకరమైన ప్రయాణం సాగిస్తుంటారు అక్కడి గ్రామస్థులు.
ఎన్నో అవస్థలు
ఎక్కడికి వెళ్లాలన్నా... నది దాటాలి. ఈ కారణంగా పండించిన పంటను అక్కడి రైతులు అమ్ముకోలేకపోతున్నారు. ఐదోతరగతి వరకే పాఠశాల ఉండటం వల్ల ఆ తర్వాత పిల్లలు చదువు కొనసాగించలేకపోతున్నారు. రేషన్ సరుకులకు సైతం నది దాటి బీరెల్లికి వెళ్లాలి. నది పొంగితే వరదనీరు ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. ఇలా ఎన్నో అవస్థలు ఆ గ్రామాన్ని వేధిస్తున్నాయి.
కేసీఆర్ హామీ ఇచ్చినా...
గుర్రంగడ్డ వాసుల ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి కేసీయారే.. 2018 జూన్ లో గద్వాలలో జరిగిన సభలో... వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పనులు మొదలయ్యాయి. నత్తనడకన సాగి ఆగిపోయాయి. నదీ ప్రవాహం వల్లే పనులు ఆగిపోయాయని అధికారులు చెబుతుండగా.. గుత్తేదారుల నిర్లక్ష్యం వల్లే ఆగాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
వచ్చే జూన్ నాటికి..
ప్రస్తుతం కృష్ణాలో ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. జూరాల నుంచి ఔట్‌ఫ్లో ఆగిపోగానే పనులు మొదలుపెట్టాలని... వచ్చే జూన్ నాటికి వంతెన నిర్మాణం పూర్తిచేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'