మహబూబ్‌నగర్ జిల్లాలో పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైనది. ఈ నెల 2న నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 7,472 మంది హాజరయ్యారు. ఇటీవల ఫలితాలు ప్రకటించారు. ర్యాంకు సాధించిన వారికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అధికారులు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించారు.
స్లాట్ బుక్ చేసుకున్న వారికి సోమవారం... ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమైంది. మంగళవారం నుంచి 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. 22న మొదటి విడత సీట్ల కేటాయింపు జరగగా... 22 నుంచి 26 వరకు వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ రుసుం చెల్లింపుతో పాటు... సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
గతేడాది వరకు ధ్రువపత్రాల పరిశీలనకు గంటకో స్లాట్ చొప్పున ఉండగా.. కొవిడ్-19 నేపథ్యంలో విద్యార్థుల సమయం వృథా కాకుండా అరగంటకో స్లాట్‌గా విభజించారు. గతంలో రెండు, మూడు పర్యాయాలు ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం ఇచ్చేవారు. ఈసారి పదోతరగతి పరీక్షలు రద్దుచేయడం వల్ల మొదటి విడత కౌన్సిలింగ్‌లో మాత్రమే ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు.
ఇదీ చూడండి: ముంబయితో అనుసంధానిస్తూ భాగ్యనగరానికి బుల్లెట్ రైలు!