మహబూబ్ నగర్ జిల్లా ప్రజల ఇసుక అవసరాలను తీర్చేందుకు 2017ఆగస్టులో అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్... పాలమూర్ సాండ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి ఇసుకను బుక్ చేసుకుంటే నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు చేరేలా విధానాన్ని రూపొందించారు. 2019 ఫిబ్రవరి వరకు ఆన్‌లైన్ బుకింగ్‌లు కొనసాగగా వినియోగదారులందరికీ ఇసుక అందించలేకపోయారు. ఆ తర్వాత పాలమూరు సాండ్ ఎత్తివేశారు. ఇసుక అందని చాలామందికి డబ్బులు తిరిగి చెల్లించలేదు. పాలమూరు సాండ్‌ను ఆపేసి ఏడాది దాటుతున్నా మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాలో ఇప్పటికీ పదుల సంఖ్యలో బాధితులుండటం గమనార్హం.
కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు
పాలమూర్ సాండ్‌ను ఆపేసినప్పటికీ ఇసుక రాలేదని దరఖాస్తు పెట్టుకున్నవారికి దాదాపుగా డబ్బులు తిరిగి చెల్లించారు. దరఖాస్తు చేసుకోని వారికి మాత్రం సొమ్ము అందలేదు. అలా అధికారుల దృష్టికిరాని వాళ్లు ఎంతోమంది ఉన్నారు. నారాయణపేట జిల్లా నుంచి ఇసుక కోసం డబ్బులు చెల్లించిన వారు మహబూబ్‌నగర్ పరిపాలనాధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇసుక అందని వారి జాబితాను రూపొందించి, తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని నారాయణపేటకు బదిలీ చేశారు. విషయం తెలియక బాధితులు మహబూబ్ నగర్ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
తికమక పడుతున్న బాధితులు
నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలానికి సైతం పాలమూర్ సాండ్ ద్వారా ఇసుక అందించారు. తొలినాళ్లలో ఇసుక సజావుగానే అందినా.. ఆ తర్వాత రాలేదు. చెల్లించిన డబ్బుల కోసం బాధితులు ఎక్కడికి వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్న విషయం తెలియక మిన్నకుండిపోయిన వాళ్లే అధికం. పేమెంట్ గేట్ వేలో సాంకేతిక సమస్యల కారణంగా డబ్బులు తిరిగి చెల్లించలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించినట్లుగా పక్కా ఆధారాలున్నా వారి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు లేక కొందరికి డబ్బులు తిరిగి చెల్లించలేకపోయారు. దాదాపు 50 లక్షల నుంచి కోటి వరకు తిరిగి చెల్లించాల్సిన డబ్బులు ఉంటాయని తెలుస్తోంది.
ఇప్పటికైనా చెల్లించాలి..
పాలమూరు సాండ్‌లో చెల్లించిన డబ్బులకు ఇసుకరాని వాళ్లకి దాదాపుగా డబ్బులు తిరిగి చెల్లించామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ డబ్బులు తిరిగిరాని వాళ్లు సంబంధిత జిల్లా కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు వందల సంఖ్యలో ఉంటారని అంచనా. ఇప్పటికైనా అధికారులు పాలమూరు సాండ్‌ను నిర్వహించిన సంస్థ ద్వారా ఎవరి బకాయిలు వారికి చెల్లించాలని జనం డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'ప్రజల నిర్లక్ష్య ధోరణే మళ్లీ వైరస్ విజృంభణకు కారణం'